Homeటాప్ స్టోరీస్ఖైదీ మూవీ రివ్యూ

ఖైదీ మూవీ రివ్యూ

 ఖైదీ మూవీ రివ్యూ
ఖైదీ మూవీ రివ్యూ

నటీనటులు: కార్తీ, నరేన్, హరీష్ ఉత్తమన్ తదితరులు
సంగీతం: సామ్ సి.ఎస్
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రభు, రాధామోహన్ (తెలుగు)
దర్శకత్వం: లోకేష్ కనకరాజ్

తెలుగులో మొదటినుండి మంచి పట్టున్న కార్తీ గత కొన్ని చిత్రాలుగా కథల ఎంపికలో చేసిన పొరబాట్లతో ఇక్కడ తన పట్టుని కోల్పోయాడు. మధ్యలో ఊపిరి, ఖాకీ వంటి మంచి సినిమాలు చేసినా కానీ ఆ తర్వాత వచ్చిన ప్లాపులతో మళ్ళీ కెరీర్ పరంగా వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలో హీరోయిన్, పాటలు, రొమాన్స్, కమర్షియల్ హంగులు వంటివేం లేకుండా కార్తీ చేసిన ప్రయత్నం ఖైదీ. నగరం అనే చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

కథ:
ఢిల్లీ బాబు (కార్తీ) యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఒక ఖైదీ. అయితే పదేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత సత్ప్రవర్తన కారణంగా నాలుగేళ్ల శిక్ష కాలం తగ్గించి విడుదల చేస్తారు. కూతుర్ని చూడాలని తపించిపోతున్న ఢిల్లీకి పోలీసుల నుండి అనుకోని టాస్క్ వస్తుంది. వాళ్ళని అతను కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని ఢిల్లీ విజయవంతంగా పూర్తి చేయగలిగాడా? అసలు ఢిల్లీకే ఎందుకు ఆ పని అప్పజెప్తారు? అసలు ఆ పని ఏంటి? ఢిల్లీ గతమేంటి? ఈ ప్రయత్నంలో తన కూతుర్ని కలుసుగోగలిగాడా అన్నది మిగతా కథ.

నటీనటులు:
కార్తీ ఎంత మంచి నటుడన్నది మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కెరీర్ మొదట్లోనే విలక్షణమైన కథల్ని ఎన్నుకుని తాను అందరిలాంటి వాడిని కాదని చెప్పకనే చెప్పాడు కార్తీ. ఖైదీ చిత్రంలో కూడా కార్తీ తన పెర్ఫార్మన్స్ తో అలరించాడు. అది యాక్షన్ సీన్లయినా, ఎమోషనల్ సన్నివేశాలైనా కార్తీ ఇందులో రఫ్ఫాడించాడు. కూతుర్ని తలుచుకుని బాధపడే సీన్లలో కార్తీ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాగే క్లైమాక్స్ లో అతని నటన మనల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. నటుడిగా కార్తీ రేంజ్ ను మరోసారి చాటి చెప్పిన చిత్రంగా ఖైదీ నిలుస్తుంది.

పోలీస్ అధికారిగా నరేన్ నటన కూడా ఆకట్టుకుంటుంది. కార్తీ వెంట ఉండే కుర్రాడు కూడా బాగా చేసాడు. మిగిలిన నటీనటులందరూ తమ పరిధి మేర రాణించారు.

సాంకేతిక నిపుణులు:
సాంకేతికంగా ఖైదీ ఉన్నతంగా నిలిచే చిత్రం. సామ్ సి.ఎస్ నేపధ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బలమైన సన్నివేశాలకు మరింత బలాన్నిచ్చి ప్రేక్షకులను కట్టిపడేస్తాయి కొన్ని సన్నివేశాలు. యాక్షన్ సీన్లు వచ్చినప్పుడు ఎంత ఎఫెక్టివ్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటుందో, ఎమోషనల్ సీన్స్ లోనూ అంతే ఎఫెక్టివ్ గా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాలి. కథ మొత్తం ఒక రాత్రే జరుగుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం నైట్ షూట్. అయినా కానీ సినిమాటోగ్రాఫర్ ఎఫెక్టివ్ గా తెరకెక్కించాడు. ఏ ఫ్రేమ్ కూడా మోనాటోనీ కాకుండా ఉండడం సినిమాకు కలిసొచ్చింది. నిర్మాత గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఏ మాత్రం అనవసర కమర్షియల్ హంగులు లేకుండా తెరకెక్కిన ఈ చిత్రం నిజంగా ఓ ప్రయోగమే. ఇలాంటి చిత్రాన్ని తెరకెక్కించడానికి గట్స్ ఉండాలి. దర్శకుడిగా లోకేష్ కనకరాజ్ మొదటి సినిమాతోనే తన ప్రతిభ చాటుకున్నాడు. అయితే ఖైదీ మాత్రం తన కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయే చిత్రం. భవిష్యత్తులో లోకేష్ ఎన్ని మంచి చిత్రాలు చేసినా ఖైదీ గురించి మాత్రం గర్వంగా చెప్పుకోవచ్చు.

చివరిగా:
ఎంత సిన్సియర్ గా కథ రాసుకున్నా, కమర్షియల్ హంగులు పెడితే రీచ్ ఎక్కువ ఉంటుందని ఎక్కడో అక్కడ కంప్రమైజ్ అయిపోయే దర్శకులున్నారు. నిజానికి ఇది వాళ్ళ తప్పు కూడా కాదు. అయితే లోకేష్ కనకరాజ్ మాత్రం తాను నమ్మిందే రాసుకున్నాడు. రాసుకున్నదే తీసాడు అనిపిస్తుంది ఖైదీ సినిమా చూస్తుంటే. కమర్షియల్ హంగులకు ఆస్కారం ఉన్నా కథకు కట్టుబడి తీసిన సినిమా ఖైదీ. సరిగ్గా నాలుగుగంటల్లో పూర్తయ్యే కథని రెండున్నర గంటల్లో చాలా ఎఫెక్టివ్ గా చూపించగలిగాడు లోకేష్. అటు యాక్షన్ సన్నివేశాలు, ఇటు ఎమోషనల్ సీన్లు ఇలా రెండూ బ్యాలెన్స్ అయ్యేలా స్క్రీన్ ప్లే కథకు కట్టుబడి రాసుకోవడం అంత సులువైన విషయం కాదు. నటీనటుల పెర్ఫార్మన్స్, సాంకేతిక నిపుణుల పనితీరు కలిసి ఖైదీ కార్తీ కెరీర్ లో స్పెషల్ చిత్రంగా నిలుస్తుంది.

అయితే కమర్షియల్ హంగులకు పెద్దగా ఆస్కారం లేని ఈ చిత్రాన్ని కమర్షియల్ చిత్రాలు చూడటానికి అలవాటు పడిపోయిన ప్రేక్షకులు ఎంత వరకూ సమ్మతం తెలుపుతారన్నదే ఖైదీ విజయం మీద ఆధారపడి ఉంది.

ఖైదీ – మెప్పిస్తాడు

రేటింగ్ –3.25/5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All