
జగన్ సర్కార్ ..భీమ్లా నాయక్ కు గుడ్ న్యూస్ చెప్పబోతుందా..? ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఇదే చర్చ నడుస్తుంది. గత కొద్దీ నెలలుగా ఏపీలో సినిమా టికెట్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ ధరలను అమాంతం తగ్గించడం తో నిర్మాతలు , డిస్టిబ్యూటర్స్ , థియేటర్స్ యాజమాన్యాలు తలలు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వం తో చర్చలు జరుపుతూ వచ్చారు. రీసెంట్ గా చిరంజీవి , మహేష్ బాబు , ప్రభాస్ , కొరటాల శివ , రాజమౌళి తదితరులు నేరుగా జగన్ ను కలిసి చర్చలు జరిపారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించారు.
ఈ తరుణంలో రేపు గురువారం టికెట్ల ధరలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో రేపు 11:30 గంటలకు జరిగే భేటీ అనంతరం.. ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వనుంది.
ఇప్పటికే టికెట్ ధరల ప్రతిపాదనలు సిద్ధం కాగా.. రేపు ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ ధరలు ఖరారైతే ఈ నెల 25న రిలీజ్ కానున్న భీమ్లానాయక్ సినిమాతో పాటు త్వరలో విడుదల కానున్న రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్, ఆచార్య వంటి సినిమాలకు మరింత ఊపిరి పోసినట్లు అవుతుంది. మరి కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.