
కరోనా మహమ్మారి చాలా మంది జీవితాల్ని చీకటి మయం చేసింది. మధ్యతరగతి జీవితాల్ని మరీ చిధ్రం చేసింది. దీని దెబ్బకి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొన్ని కుటుంబాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆశ ఎంత వున్నా మధ్యతరగతి జీవితాలు చాలినా చాలకున్నా అవసరాల్ని తీర్చుకుంటూ బ్రతుకీడుస్తున్నారు.
అలాంటి వారి జీవితాల్లో కరోనా అణుబాంబ్ పేలింది. ఈ మహమ్మరి కారణంగా సగటు జీవి ఆత్మహత్యలకు కూడా దిగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్ గార్డెన్ సమీంలో వున్న ఐమాక్స్ థియేటర్ ఆపరేటర్ ప్రాణం తీసింది. ఆర్థిక ఇబ్బందులతో థియేటర్ ఆపరేటర్ భాస్కర్ (52) ఆత్మ హత్యకు పాల్పడటం సంచలనంగా మారింది.
కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో థియేటర్లన్నీ మూతపడ్డాయి. అప్పటి నుంచి థియేటర్ సిబ్బందికి జీతాలు ఇవ్వడం మానేసింది సదరు ఐమాక్స్ థియేటర్ యాజమాన్యం. కానీ థీయేటర్ ఆపరేటర్ భాస్కర్‌కు మాత్రం హాఫ్ సాలరీ ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే ఎంతకూ థియేటర్స్ రీఓపెన్ అయ్యే పరిస్థితులు కనిపించకపోవడంతో యాజమాన్యం హాఫ్ సాలరీని కూడా ఇవ్వలేమని చేతులు ఎత్తేసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భాస్కర్ ఆత్మ హత్యకు పూనుకోవడం కలకలం రేపుతోంది.