
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల హడావిడి ఇక రెండు రోజుల్లోకి వచ్చేసింది. అక్టోబర్ 10న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విమర్శలు, ప్రతి విమర్శల స్థాయి బాగా పెరిగిపోయింది. ఒక ప్యానెల్ పై మరొకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా సీన్ లో లేని నాగబాబు ఇప్పుడు మీడియా ముందుకొచ్చి మంచు విష్ణు ప్యానెల్ పై విమర్శలు చేసాడు. ఆ ప్యానెల్ వాళ్ళు ఓటుకు 10 వేలు చొప్పున ఇస్తున్నారని ఆరోపించాడు.
ఈ విమర్శలపై మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు. “10 వేలు బాగా తక్కువవుతుంది అని 1 లక్ష ఇద్దామనుకున్నాం. కానీ మాకు బడ్జెట్ సరిపోలేదు. దీంతో 75 వేలుకి తెగ్గొట్టామ్. అంతెందుకు మహేష్ కు కూడా నేను 75 వేలు గూగుల్ పే చేశా. ఆయన ఇండియాలో లేడు కాబట్టి చూసుకుని ఉండడు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారివద్దకు వెళ్లి 75 వేలు వెనక్కి తీసుకుంటా” అని మంచు విష్ణు వెటకారంగా స్పందించాడు.
మా ప్రెసిడెంట్ ఎన్నికలకు అటు ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఇటు మంచు విష్ణు ప్యానెల్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 10వ తేదీన ఫలితాలు కూడా వెల్లడవుతాయి.