
సినిమా కథ డిమాండ్ మేరకు మన హీరోలు ఈ మధ్య ఏది చేయాలంటే అది చేయడానికి సిద్ధపడుతున్నారు. గతంలో తెలుగు హీరో అంటే షర్ట్ నలక్కుండా, కాలర్ మాయకుండా వుండే వారు కానీ కాలం మారింది. ఆడియన్స్‌ని మెప్పించాలంటే ఎంతటి స్టార్ హీరో అయినా శ్రమించాల్సిందే. తాజాగా తన కొత్త చిత్రం కోసం రిస్క్ అని తెలిసినా షూటింగ్ చేసి ప్రమాదంలో ఇరుక్కున్నారు శర్వానంద్. `జాను` సినిమా చిత్రీకరణ సమయంలో ప్రమాదానికి గురికావడంతో శర్వానంద్ భుజానికి ఫ్రాక్చర్ అయింది.
ఆగాయం నుంచి శర్వా తేరుకోవడానికి అపోలోకు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్లు భారీ కసరత్తే చేయాల్సి వచ్చింది. మొత్తానికి ఆపరేషన్ సక్సెస్ కావడంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న శర్వానంద్ ఆ తరువాత `జాను` షూటింగ్‌ని పూర్తి చేశారు. సినిమా ఫలితం తారుమారు కావడంతో ప్రస్తుతం ఆమెరికాలో వున్న శర్వాకు మళ్లీ భుజం గాయం తిరగదోడిందట.
పరీక్షించిన డాక్టర్లు ఆపరేషన్ చేయాల్సిందే అని సూచించడంతో శర్వా తన భుజానికి శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారట. త్వరలోనే ఆపరేషన్ జరగనుందని తెలిసింది. `జాను` తరువాత శర్వానంద్ 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తున్న `శ్రీకారం` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ తిరుపతి, హైదరాబాద్‌లలో జరగనుంది. ఆపరేషన్ తరువాతే ఈ మూవీ షూటింగ్‌లో శర్వా పాల్గొంటారని తెలిసింది.