
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకొని నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరం, బాధాకరమని అన్నారు. సంఘటన తమ దృష్టికి రాగానే అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో 13 మంది మహిళలు, నిమ్స్ ఆస్పత్రిలో 17 మంది మహిళలను చేర్పించి, వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
వారందరూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. నిమ్స్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మృతి చెందిన నలుగురు మహిళల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాతో పాటు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. వారి పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించి చదివించేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. ‘ఏడేళ్లలో 12 లక్షల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయి. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.
మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం’ అని హరీశ్ రావు అన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న మిగిలిన మహిళలు సురక్షితంగా ఉన్నారని.. వారికి మరోసారి పరీక్షలు జరిపి కోలుకున్న తర్వాత ఇంటికి పంపిస్తామని తెలిపారు. రాత్రి, పగలు తేడా లేకుండా బాధితుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇన్‌ఫెక్షన్ కారణంగానే మహిళలు మృతి చెందినట్లు తెలిసిందని హరీశ్ రావు అన్నారు. పోస్టుమార్టం రిపోర్టు, డీహెచ్ నివేదిక ఆధారంగా అసలు కారణాలు తెలుస్తాయని తెలిపారు. ఈ ఘటనపై డీహెచ్ నివేదిక వచ్చాక నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.