
`రుద్రమదేవి` చిత్రం తరువాత గుణశేఖర్ నుంచి మరో చిత్రం రాలేదు. ఆయన రానాతో భారీ బడ్జెట్‌తో మైథలాజికల్ డ్రామాగా `హిరణ్యకశ్యిప` చిత్రాన్ని చేయబోతున్నారు. ఇదే విషయాన్నిచాలా రోజుల క్రితం ప్రకటించారు కూడా రానాతో పాటు డి. సురేష్‌బాబు కూడా ఈ ప్రాజెక్ట్ గురించి మీడియాకు పలు సందర్భాల్లో వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ గత నాలుగేళ్లుగా అమెరికాలో జరుగుతోంది.
ఇదిలా వుంటే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఇంకా సమయం వుంది కాబట్టి గుణశేఖర్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రచారం మొదలైంది. అయితే ఇందు కోసం ఆయన చెప్పిన కథ నెట్ ఫ్లిక్స్‌కి నచ్చలేదని, దాంతో వారు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారని ప్రచారం మొదలైంది.
దీనిపై గుణశేఖర్ స్పందించారు. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, తాను వారితో ఒప్పందం చేసుకోలేదని, వెబ్ సిరీస్ చేయాలన్న ఆలోచనే తనకు లేదని స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలని నమ్మొద్దని, త్వరలోనే తాను ఓ అప్‌డేట్‌ని వెల్లడించబోతున్నానని ప్రకటించారు.