
హీరో గోపీచంద్ హిట్ మాట విని చాలా ఏళ్లే అవుతోంది. `పంతం` కొంచం ఊరట కలిగించినా ఆ తరువాత చేసిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. సౌఖ్యం నుంచి చాణక్య వరకు అన్నీ ఫ్లాపులే ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సంపత్‌నందితో కలిసి `సీటీమార్` చిత్రం చేస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తెలంగాణ యువతిగా జ్వాలా రెడ్డిగా తమన్నా కనిపించబోతోంది. ఆంధ్రా కబడ్డీ జట్టు కోచ్‌గా గోపీచంద్ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ సినిమాతో పాటు తేజ దర్శకత్వంలో `అలిమేలు మంగ వెంకట రమణ` చిత్రాన్ని అంగీకరించిన గోపీచంద్ తాజాగా మరో క్రేజీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. `సాహో` చిత్రంతో స్టార్ డైరెక్టర్‌ల జాబితాలో చేరిపోయిన సుజీత్ దర్శకత్వంలో గోపీచంద్ ఓ భారీ చిత్రాన్ని చేయనున్నట్టు తెలిసింది. `సాహో` తరువాత మలయాళ హిట్ చిత్రం `లూసీఫర్` రీమేక్‌ని తెరకెక్కించే గోల్డెన్ ఛాన్స్‌ని దక్కించుకున్నట్టే దక్కించుకుని పోగొట్టుకున్న సుజీత్ తాజాగా కొత్త కథతో గోపీచంద్‌ని ఒప్పించినట్టు తెలిసింది.
ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే వంశీ, ప్రమోద్‌లని సుజీత్ ఒప్పించారట. దీనికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ప్రభాస్, గోపీచంద్ గత కొన్నేళ్లుగా మంచి స్నేహితులు.. ఎంత అంటే ఓరేయ్ ఓరేయ్ అనుకునేంత. ఆ చనువు వల్లే గోపీచంద్‌కు తాజా ఆఫర్ దక్కిందని చెబుతున్నారు. గతంలో యువీ క్రియేషన్స్‌లో గోపీచంద్ `జిల్` చిత్రాన్ని చేసిన విషయం తెలిసిందే.