
భారతీయ సినీ ప్రపంచంలో జెమిని సంస్థది ఒక సువర్ణాధ్యాయం. ఈ సంస్థ వందల సినిమాల్ని అందించింది. ఎంతో మంది నటీనటులకు ఉన్నతమైన కెరీర్‌ని అందించి వారి జీవితాల్ని మలుపుతిప్పడంలో కీలక పాత్రని పోషించింది. ఈ సంస్థలో టాలీవుడ్ అలనాటి దిగ్గజాలు ఎన్టీఆర్, ఏ ఎన్నార్, సావిత్రి, జమున, ఎస్వీరంగారావు, గుమ్మడి, శివాజీగణేషన్ వంటి తారలతో పాటు మెగాస్టార్ చిరంజీవి, కమల్‌హాసన్, రజనీకాంత్ వంటి స్టార్స్ నటించారు.
ఇలాంటి మహా సంస్థని స్థాపించి 75 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో డైమండ్ జూబ్లీ వేడుకల్ని సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. జెమినీ సంస్థల సీఈవో పీవిఆర్ మూర్తి గారి చేతుల మీదుగా డైమండ్ జూబ్లీ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. డైమండ్ జూబ్లీ సందర్‌భంగా జెమినీ సంస్థ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. జెమినీ గ్రూప్‌లో ఎన్నో సంస్థలున్నాయి. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్, జెమినీ వీఎఫ్ ఎక్స్, జెమినీ స్టూడియోస్.. ఇలా చాలా సంస్థలున్నాయి.
జెమినీ రికార్డ్స్ లేబుల్‌తో సంగీత ప్రపంచంలోకి ప్రవేశిస్తోంది. జెమినీ రికార్డ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ ను నిర్మించడమే కాకుండా సినిమాలకు కూడా పనిచేయబోతోంది. సినిమా పాటలని రిలీజ్ చేయబోతోంది. ప్రవేశించిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసిన జెమినీ మ్యూజిక్ ఇండస్ట్రీలోనూ విజయాన్ని సాధించాలని ఆశిద్దాం.