
కరోనా సినీ ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బతీసింది. చాలా వరకు సినిమాలు నిర్మాణ దశలోనే ఆగిపోయాయి. కొన్ని రిలీజ్ దశలో వుండి ఎటు వెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఓటీటీకి వెళ్లాలా లేక థియేటర్స్ రీ ఓపెన్ అయ్యేంత వరకు వేచి చూడాలా? అని అయోమయానికి గురవుతున్నాయి. ఇదిలా వుంటే ఇటీవల షూటింగ్‌లకు పర్మీషన్ ఇస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలని రిలీజ్ చేశాయి.
దాని ప్రకారం షూటింగ్‌లు చేసుకోండని, కోవిడ్ నియమాలని పాటించండని వెల్లడించాయి. అయితే ఈ నిబంధనల ప్రకారం షూటింగ్‌లు చేయడం, లొకేషన్‌లకి వెళ్లడం మాస్కులు వేసుకున్నంత ఈజీ కాదని దర్శకుడు గౌతమ్ మీనన్ అంటున్నారు. సినిమాలు తగ్గించుకుని గౌతమ్ మీనన్ వెబ్ సిరీస్‌ల బాట పట్టిన విషయం తెలిసిందే. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా `క్వీన్` వెబ్ సిరీస్‌ని రూపొందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విక్రమ్ హీరోగా `ధృవనక్షత్రం` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కావాల్సి వుంది.
కరోనా కాలంలో కొత్త ఆలోచనలు, ఓటీటీ వేదికల గురించి గౌతమ్ మీనన్ ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులలో చిత్ర బృందంలో ఎవరికీ కరోనా సోకకుండా జాగ్రత్తగా చిత్రీకరణ ఎలా చేయాలని చర్చలు జరుగుతున్నాయి. మన సెట్స్, లొకేషన్స్ ఎంత సేఫ్? అనేది చర్చకు వచ్చింది. ఇప్పుడు చిత్రీకరణలకు వెల్లడం, చేయడం.. ముఖానికి మాస్కు వేసుకున్నంత ఈజీ కాదు. కరోనా వైరస్ నుంచి ఉపశమనం కావాలి. వ్యాక్సిన్ లేదా మిరాకిల్ ఏదో జరగాల్సిందే. ఈ పరిస్థితుల్లో ఓటీటీ యువ దర్శకులకు, స్టార్ డైరెక్టర్లకు వేదికగా నిలుస్తోంది. విభిన్నకథల్ని అందులో చెప్పడానికి వీలుంటోంది` అన్నారు గౌతమ్ మీనన్.