Homeటాప్ స్టోరీస్గ్యాంగ్ లీడర్ రివ్యూ

గ్యాంగ్ లీడర్ రివ్యూ

Gang Leader movie review in Telugu
Gang Leader movie review in Telugu

నటీనటులు: నాని, ప్రియాంక అరుళ్ మోహన్, లక్ష్మి, శరణ్య మోహన్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, కార్తికేయ తదితరులు
దర్శకత్వం: విక్రమ్ కుమార్
నిర్మాణం: మైత్రి మూవీ మేకర్స్
సంగీతం: అనిరుధ్
కూర్పు : నవీన్ నూలి
విడుదల తేదీ : 13 సెప్టెంబర్ 2019
రేటింగ్ : 3/5

న్యాచురల్ స్టార్ నాని చేసిన ఎమోషనల్ ఎంటర్టైనర్ జెర్సీకి మంచి రివ్యూలు వచ్చినా కలెక్షన్లు ఆ స్థాయిలో రాలేదు. ఈ నేపథ్యంలో నాని రూట్ మార్చి తనకు బాగా అచొచ్చిన ఎంటర్టైన్మెంట్ నే నమ్ముకున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమా చేసాడు. అయితే విక్రమ్ కుమార్ సినిమాలంటేనే ఏదొక ఆసక్తికరమైన అంశం ఉంటుంది. అందుకే ఈసారి రివెంజ్ స్టోరీని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో చెప్పడానికి ప్రయత్నించారు. టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్నిట్లోనూ గ్యాంగ్ లీడర్ ప్రేక్షకులకు నచ్చింది. మరి ఈరోజు విడుదలైన సినిమా ఎలా ఉందో చూద్దామా.

- Advertisement -

కథ :
కథ గురించి చెప్పుకోవడానికి కొత్తగా ఏం లేదు. ఇప్పటికే ట్రైలర్ లో మనకు కథ ఏంటో వివరంగా చెప్పేసారు. పెన్సిల్ పార్థసారథి (నాని) తానో గొప్ప రివెంజ్ రైటర్ గా ఫీల్ అయిపోతుంటాడు. సాదాసీదాగా సాగిపోతున్న అతని జీవితంలోకి ఐదుగురు ఆడవాళ్ళు ప్రవేశించడంతో కథ మలుపుతిరుగుతుంది. వాళ్లకు ప్రతీకారం కావాలి. అయితే వాళ్ళు నానినే ఎందుకు ఎంచుకున్నారు? వాళ్ళ నేపధ్యం ఏంటి? వాళ్లకు జరిగిన అన్యాయం ఏంటి? ఇంతకీ ప్రతీకారం తీర్చుకున్నారా లేదా వంటి విషయాలు తెల్సుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

కథనం :
విక్రమ్ కుమార్ సినిమాలెప్పుడూ సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉంటాయి. రెగ్యులర్ గా సినిమాలు తీయడం తన వల్ల కాదు. స్టోరీ పాతదే అయినా దానికి తనదైన శైలిలో ట్రీట్మెంట్ ఇవ్వడం విక్రమ్ కుమార్ స్టైల్. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ లో కూడా రివెంజ్ మరియు కామెడీని కలిపాడు. ఐదుగురు ఆడవాళ్లు తమ ప్రతీకారాన్ని ఒకడి సహాయంతో ఎలా తీర్చుకున్నారన్న కథను హిలేరియస్ గా చెప్పడంలో విక్రమ్ కుమార్ కొంత మేర సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

గ్యాంగ్ లీడర్ కథ చాలా పలుచనైనది. అందుకే విక్రమ్ కుమార్ కథను ఎంటర్టైనింగ్ వే లో చెప్పడానికి ప్రయత్నించాడు. సినిమా మొదటి హాఫ్ అంతా పాత్రల పరిచయాలు, నాని రివెంజ్ స్టోరీ రైటర్ పెన్సిల్ పార్థసారథిగా చేసే హడావిడి.. దాన్నుండి వచ్చే ఫన్, ఇలా సరదా సరదాగా సాగిపోతుంది. సినిమా మొదలు కావడమే అత్యంత ఆసక్తికరంగా మొదలవడంతో ప్రేక్షకులు ఇదో స్పెషల్ సినిమా అన్న ఫీలింగ్ కు వచ్చేస్తారు. కానీ ఆ తర్వాత సాగతీత తప్ప ఎంతసేపటికీ అసలు కథ రాకపోవడంతో కొంత అసహనం కూడా ప్రేక్షకులకు కలుగుతుంది.

అయితే సరిగ్గా ఇంటర్వెల్ దగ్గర కానీ అసలు కథ బయటకి రాదు. ఇక్కడ విలన్ గా కార్తికేయ ఎంట్రన్స్ కూడా సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇక సెకండ్ హాఫ్ ను విక్రమ్ కుమార్ చాలా భాగం వరకూ బాగానే డీల్ చేసాడు. సినిమాకు మెయిన్ పాయింట్ అయిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ఇంకొంచెం ఎఫెక్టివ్ గా తీసి ఉండాల్సింది. అనుకున్నంత ఎమోషనల్ డెప్త్ ఈ ఎపిసోడ్ లో లేదు. పైగా క్లైమాక్స్ కూడా ఎవరో తరుముతున్నట్లు హడావిడిగా ఉంటుంది.

నటీనటులు :
నాని ఇలాంటి సినిమాలు చాలా చేసేసాడు. తన ప్రధాన బలమైన ఎంటర్టైన్మెంట్ మీదే సినిమా ఎక్కువగా సాగడంతో నాని అలవోకగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే నాని సినిమా అంటే కచ్చితంగా ఒక ఎమోషనల్ సీన్ అయినా ఉండాలి కదా. సీనియర్ నటి లక్ష్మితో ఉన్న ఆ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే నాని తనకు తానే హై బెంచ్ మార్క్ ను సెట్ చేసుకోవడం వల్ల ఇది అంత స్పెషల్ గా ఏం అనిపించదు.

మరోవైపు కథకు అత్యంత కీలకమైన ఐదుగురు ఆడవాళ్ళలో సీనియర్ నటి లక్ష్మి ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత శరణ్య మోహన్ కూడా తనదైన శైలిలో నటించింది. అయితే హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్.. నాని, లక్ష్మి, శరణ్య వంటి టాలెంటెడ్ నటుల మధ్య పూర్తిగా తేలిపోయింది. ఆమె గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. చిన్న పిల్ల క్యూట్ గా ఆకట్టుకుంటుంది. విలన్ గా చేసిన కార్తికేయ మెప్పించాడు. ఉన్నది కాసేపే అయినా తన ప్రెజన్స్ తెలిసేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. వెన్నెల కిషోర్ ఉన్న కాసేపూ నవ్వుల పువ్వులు పూయించాడు. ప్రియదర్శి మామూలే. మిగిలినవాళ్ల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు.

సాంకేతిక నిపుణులు :
విక్రమ్ కుమార్ సినిమాలు సాంకేతికంగా ఉన్నతంగా ఉంటాయి. గ్యాంగ్ లీడర్ ఈ విషయంలో నిరాశపరచదు. ముందుగా చెప్పుకోవాల్సింది సంగీతం గురించి. సినిమాకు తగ్గ ఔట్పుట్ ఇవ్వడంలో అనిరుధ్ సక్సెస్ అయ్యాడు. నిన్ను చూసే ఆనందంలో, రారా, హొయినా హొయినా పాటలు మెప్పిస్తాయి. పాటల చిత్రీకరణ ఇంకొంచెం బాగుండచ్చు. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా అనిరుధ్ మంచి మార్కులే వేయించుకుంటాడు.

కీలకమైన సన్నివేశాలకు బలమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. సినిమాకు తగ్గ మూడ్ క్రియేట్ చేయడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు. క్లైమాక్స్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాకు ఏం కావాలో అవన్నీ చేసి పెట్టారు.

ఇక విక్రమ్ కుమార్ దర్శకత్వం గురించి చెప్పుకోవాలంటే.. ఒక సాధారణ కథను తీసుకుని సరికొత్త కోణంలో చెప్పాలన్న పాయింట్ బాగుంది కానీ తను ఈ సినిమాను పూర్తి పెర్ఫెక్షన్ తో డీల్ చేయలేదేమో అనిపిస్తుంది. సినిమాలో చాలా చోట్ల అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. ఒక హై పాయింట్ వచ్చిందని ఆసక్తి చూపే లోపే కాసేపు నరేషన్ ఫ్లాట్ అయిపోతుంది. నరేషన్ మీద విక్రమ్ కుమార్ ఇంకొంచెం వర్క్ చేసుంటే బాగుండేది.

చివరిగా :
పాత గ్యాంగ్ లీడర్ ఏ మాత్రం పోలిక లేని ఈ సినిమా అక్కడక్కడా మెప్పిస్తుంది. అక్కడక్కడా బోర్ కొట్టిస్తుంది. ఏదేమైనా కామెడీ కోసం, నాని కోసం, డీసెంట్ సెకండ్ హాఫ్ కోసం గ్యాంగ్ లీడర్ ను ఒకసారి హ్యాపీగా చూడవచ్చు. అయితే మీ అంచనాలను కొంచెం అదుపులో పెట్టుకుని వెళ్లడం మర్చిపోకండి.

పంచ్ లైన్: నాని కోసం వన్ టైమ్

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All