
ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో న్యాచురల్ స్టార్ నాని ఒకరు. సినిమా ఏమాత్రం బాగున్నా అతని సినిమాలు చాలా సులువుగా మిలియన్ డాలర్ మార్క్ దాటేస్తాయి. అయితే నాని తాజా సినిమా గ్యాంగ్ లీడర్ మాత్రం మిలియన్ డాలర్ మార్క్ అందుకోవడానికి నానా కష్టాలు పడుతోంది.
చూస్తుంటే గ్యాంగ్ లీడర్ మిలియన్ డాలర్ అందుకోవడం అసాధ్యమే. నిజానికి గ్యాంగ్ లీడర్ సినిమాకు ఓవర్సీస్ లో మంచి ఓపెనింగ్ వచ్చింది. కేవలం ప్రీమియర్స్ ద్వారానే $200K కు మించి వసూలు చేసింది. మొదటి వారాంతానికి 630,860 డాలర్లను ఖాతాలో వేసుకుంది. ఐదు రోజులకు చూసుకునేసరికి $800K కలెక్షన్స్ దాటేసింది. దీంతో గ్యాంగ్ లీడర్ మిలియన్ డాలర్ మార్క్ దాటడం నల్లేరు మీద నడకే అనుకున్నారంతా.
అయితే బుధవారం నుండి పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చేసింది. కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయి. దీనికితోడు గద్దలకొండ గణేష్ చిత్రం విడుదల కావడంతో గ్యాంగ్ లీడర్ పూర్తిగా డల్ అయిపోయాడు. రెండో వీకెండ్ ముగిసేనాటికి 915,900 డాలర్లకే పరిమితమై గ్యాంగ్ లీడర్ అక్కడ ఫుల్ రన్ కు దగ్గరకు వచ్చేసింది.