
విద్యార్థుల ఆందోళనలతో తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, తమ క్యాంపస్ కు సీఏం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ వచ్చి తమ సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని పత్రికా ప్రకటనలు, ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ తెలియజేశారు. అయితే ఎట్టకేలకు బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి అక్కడి విద్యార్థులతో మాట్లాడారు మంత్రి కేటీఆర్.
బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా బయల్దేరి జైనద్ మండలం దీపాయిగూడ చేరుకుని, అక్కడ మాతృ వియోగంతో ఉన్న ఎమ్మెల్యే జోగు రామన్న కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి కేటీఆర్. అనంతరం ఆదిలాబాద్ లోని BDNT డాటా సొల్యూషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు. అనంతరం నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి అక్కడి విద్యార్థులతో సమావేశం అయ్యారు. విద్యార్థులతో కలిసి మంత్రి కేటీఆర్ భోజనం చేశారు. మద్యాహ్నం ఒంటిగంట సమయంలో మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి కూడా బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు.
ఈ ఏడాది జూన్‌లో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వారం రోజుల ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా సీఏం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ తమ వద్దకు రావాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అప్పుడిచ్చిన హామీ మేరకు కేటీఆర్ క్యాంపస్‌కు వెళ్లారు. ఇదిలా ఉంటే.. విపక్షాల పొంతన లేని మాటలు ఆశ్చరం కలిగిస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో తెలంగాణ టాప్‌లో ఉంటుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్‌లో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందని అన్నారు కేటీఆర్. స్వచ్ఛ ర్యాంకుల్లో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు 16 అవార్డులు గెలుచుకున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ర్యాంకుల్లో తెలంగాణ అగ్రభాగంలో ఉందని, అయినా తెలంగాణలోని విపక్షాలు.. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటున్నాయని అన్నారు. విపక్షాల పొంతన లేని మాటలు ఆశ్చరాన్ని కలిగిస్తున్నాయని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.