
పాన్ ఇండియా చిత్రాలకు టాలీవుడ్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇప్పటికే తెలుగు స్టార్స్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కొన్ని చిత్రాలు నిర్మాణ దశలో వుండగా కొన్ని త్వరలో పూర్తయి రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో క్రేజీ కాంబినేషన్‌లో మరో పాన్ ఇండియా మూవీ సెట్ కానుందా అంటే ఇండస్ట్రీ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఇంతకీ ఆ క్రేజీ కాంబినేషన్ ఏంటని ఆరా తీస్తే షాకింగ్ విషయం తెలిసింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్‌ల కలయికలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రానికి ప్లాన్ జరుగుతోందని తాజా న్యూస్. ఇప్పటికే రామ్‌చరణ్, శంకర్‌లతో పాన్ ఇండియా మూవీని ప్రకటించిన దిల్ రాజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్‌లతో మరో పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టబోతున్నారట.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ – ప్రభాస్‌ల కలయికలో `సలార్` రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. దీనితో పాటు `ఆది పురష్` చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ రెండూ పూర్తయిన తరువాత నాగ్ అశ్విన్ చిత్రాన్ని ప్రారంభిస్తారు. ఇవన్నీ పూర్తయిన తరువాతే దిల్ రాజు సినిమా వుండే అవకాశం వుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా బయటికి రాలేదు. ఈ ప్రాజెక్ట్‌ని దిల్ రాజు ప్రకటిస్తారా? లేక మరి కొంత సమయం తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే.