
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్‌బాబు ప్రస్తుతం వెంకటేష్‌తో `నారప్ప` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ ని నిరవధికంగా ఆపేశారు. ఇదిలా వుంటే సురేష్ ప్రొడక్షన్స్ నుంచి తాజాగా మరో రెండు చిత్రాల్ని అనౌన్స్ చేశారు. కథాబలమున్న చిత్రాలకే తొలి ప్రాధాన్యతనిస్తున్న సురేష్ బాబు రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులతో రెండు చిత్రాల్ని నిర్మించబోతున్నట్టు ప్రకటించారు.
ఈ రెండు చిత్రాల ద్వారా సతీష్ త్రిపుర, అశ్విన్ గంగరాజు దర్శకులుగా పరిచయం కానున్నారు. ఇందులో సతీష్ త్రిపురతో ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్‌ని, అశ్విన్ గంగరాజు తో ఓ ప్రముఖ వ్యాపారవేత్త మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించబోతున్నారట. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ నుంచి ఇద్దరిని ఎంపిక చేసుకుని సురేష్ ప్రొడక్షన్స్ తొలిసారిగా పరిచయం చేస్తుండటం ఆసక్తిగా మారింది.
మా ఫిల్మ్ స్కూల్ విద్యార్థుల్ని కొన్నేళ్లుగా సినీ రంగంలో వచ్చే మార్పులకు, సవాళ్లకు సిద్ధంగా వుండేలా మలచడంలో సక్సెస్ అయ్యామని ఈ సందర్భంగా డి. సురేష్‌బాబు వెల్లడించారు. డిజిటల్ రంగం రాకతో ఫిల్మ్ మేకింగ్‌లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని దీనికి తగ్గట్టుగానే మా ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్‌ని సిద్ధం చేశామని రానా స్పష్టం చేశారు.