
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ప్రహసనం ఎట్టకేలకు ముగిసింది. గత నెల రోజులుగా వరసపెట్టి ప్రెస్ మీట్లు, టివిలో ఇంటర్వ్యూలు అంటూ గోల గోల చేసిన ‘మా’ మెంబర్లు మొత్తానికి నిన్న జరిగిన ఎన్నికలతో శాంతించారు. మా ప్రెసిడెంట్ ఎన్నికలలో లోకల్ ఫీలింగ్ ను పైకి లేపిన మంచు విష్ణు ఘనవిజయం సాధించాడు. తనతో పాటు మరికొంత మంది ప్యానెల్ సభ్యులు కూడా గెలుపొందారు. ప్రకాష్ రాజ్ మా ప్రెసిడెంట్ గా ఓడిపోయాడు.
ప్రకాష్ రాజ్ కు మెగా సపోర్ట్ వెనకాల నుండి అందించిన మాట అందరికీ తెల్సిన విషయమే. ముందు నుండి నాగబాబును పంపి చిరంజీవి బయటకు వచ్చి ఓపెన్ గా సపోర్ట్ చేయకపోవడం కొంత విజయావకాశాలను దెబ్బ తీసిందని చెప్పవచ్చు. తాజా ఎన్నికలతో మెగా ఫ్యామిలీకు సంబంధించి ఒక ఆసక్తికర చర్చ సాగుతోంది.
రాజకీయాలకు మెగా ఫ్యామిలీ సరిపోదని, వారి మంచితనం దీనికి సెట్ అవ్వదని మరోసారి తేటతెల్లమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక ఓటరును ఆకర్షించడం ఎలానో మెగా ఫ్యామిలీకు తెలీదని, అదంతా రాజకీయానికి సంబంధించిన విషయమని, మెగా ఫ్యామిలీకు అది తెలియదని విశ్లేషకులు చెబుతున్నారు.
సాధారణ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని ‘మా’ ఎన్నికలలో మెగా ఫ్యామిలీ కూడా మంచు విష్ణు తరహాలో రాజకీయం చేసుంటే కచ్చితంగా ఘనవిజయం సాధించేది అని అంటున్నారు. మంచితనంతో ఓట్లు రాలవని, రాజకీయం చేయాలనుకున్నప్పుడు రాజకీయమే చేయాలని అంటున్నారు.