
తెలుగు వారికి ప్రధాన వినోద మార్గాల్లో మొదటిది సినిమా అయితే రెండోది కచ్చితంగా క్రీడలే. క్రీడలు అంటే మన దేశంలో కచ్చితంగా మొదట గుర్తొచ్చేది క్రికెట్. ఈ క్రీడ అంటే ప్రతీ భారతీయుడు చెవి కోసుకుంటారు. భారత క్రికెట్ జట్టు ఆడినన్ని మ్యాచ్ లు ప్రపంచంలో మరే క్రికెట్ జట్టు ఆడదేమో. అంతర్జాతీయ మ్యాచ్ లకు అదనంగా ఐపీఎల్ అంతులేని వినోదం కూడా మనకు ఉంది. దీంతో ప్రతీ నెలా అయితే క్రికెట్ లేదా సినిమా కుదిరితే రెండూ అన్నట్లుగా తెలుగు వారి వినోదానికి మంచి కాలక్షేపం జరుగుతోంది. అయితే వచ్చే నెల రోజులు తెలుగు వారు వినోదానికి వేరే కేరాఫ్ అడ్రస్ వెతుక్కోవాలేమో. ఎందుకంటే కరోనా వైరస్ దెబ్బ అలా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా కరోనా వైరస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ వైరస్ దెబ్బకు కుదేలవ్వని ఇండస్ట్రీ అంటూ లేదు. ఎయిర్ లైన్స్ దగ్గరనుండి సినిమా వ్యాపారం వరకూ ప్రతీ ఇండస్ట్రీ భారీ నష్టాలను చవిచూస్తోంది. ప్రజలు అసలు ఇళ్లల్లోంచి బయటకు రావడానికే ఇష్టపడట్లేదు. భారతదేశంలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. ఈరోజు నుండి తెలంగాణాలో థియేటర్లు, షాపింగ్ మాల్స్, పబ్ లు, స్కూల్స్, కాలేజీలు వంటివన్నీ బంద్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి రావొచ్చు. ఒకవేళ థియేటర్లు బంద్ అవ్వకపోయినా కొత్త సినిమాలు ఎలాగు రిలీజ్ అవ్వవు కాబట్టి ప్రయోజనం లేదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లు అన్నీ రద్దయ్యాయి. మార్చ్ 29 నుండి జరగాల్సిన ఐపీఎల్ ఏప్రిల్ 15కి వాయిదా పడింది. అప్పుడు కూడా ఉంటుందో లేదో తెలీదు. ఉన్నా కూడా కుదించి షెడ్యూల్ చేస్తారు. ఇలా సినిమాలూ లేక, క్రికెట్ లేక తెలుగు వారు వచ్చే నెల రోజులు ఎలా గడపాలా అన్నది ఆలోచిస్తున్నారు.
అయితే కరోనా వైరస్ భయం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు కాబట్టి మనం ప్రభుత్వానికి సహకరించాలి. అది మనందరి బాధ్యత. ఇది వినోదం గురించి ఆలోచించే సమయం కాదు.