
ఏపీ సీఎం జగన్ కడప జిల్లాలో రెండోరోజు పర్యటిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులర్పించారు. సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి సీఎం జగన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం.. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తన తండ్రిని తలుచుకుంటూ సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ చేశారు. నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి.
దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. అనంతరం విడతల వారీగా సాయంత్రం వరకు పులివెందుల నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాల పై స్థానిక నాయకులు, అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇక.. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.
వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యే ధర్మశ్రీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. తన సొంత వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు. జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ టూర్‌లో భాగంగా వైఎస్సార్ జిల్లాలో పలు ముఖ్యమైన ప్రాజెక్టులు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా గురువారం కడపకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కడప ఎయిర్‌పోర్టు నుంచి వేముల మండలంలోని వేల్పుల గ్రామానికి సీఎం జగన్ చేరుకున్నారు. వేల్పులలో సచివాలయ కాంప్లెక్స్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం సచివాలయ కాంప్లెక్స్ సముదాయాన్ని సీఎం పరిశీలించారు. వేల్పులలో ఒకే ప్రాంగణంలో అన్ని ప్రభుత్వ సంక్షేమ భవనాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఆరు ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేశామన్నారు.