
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాడు. ఈ చిత్రం దిల్ రాజు బ్యానర్ కు 50వ చిత్రం. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలవ్వకముందే చిక్కుల్లో పడింది.
శంకర్ కు, లైకా ప్రొడక్షన్స్ సంస్థకు మధ్య మొదలైన వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఇండియన్ 2 పూర్తి చేయకుండా శంకర్ మరో చిత్రాన్ని మొదలుపెట్టడానికి లేదంటూ లైకా ప్రొడక్షన్స్ కోర్టులో కేసు వేయడంతో విషయం బయటపడింది. అయితే కోర్టు ఈ విషయాన్ని వీలయితే చర్చల ద్వారా కోర్టు అవతల పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకూ సూచించింది.
కానీ ఇద్దరి మధ్యన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ శంకర్ ను బాండ్ రాసివ్వమనడంతో దానికి శంకర్ ఒప్పుకోవట్లేదు. కోర్టు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని తదుపరి విచారణ మూడు వారాల తర్వాతకు వాయిదా వేసింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.