
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా తన ప్రస్ధానాన్ని ప్రారంభించి అప్పుడే 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోషల్‌మీడియా వేదికగా ఆయన అభిమానులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. 2001లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు నిర్మించిన చిత్రం `నిన్ను చూడాలి`. వి.ఆర్. ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాలో ముద్దుగా బొద్దుగా కనిపించి ఆకట్టుకున్న ఎన్టీఆర్ కు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకుడిగా పరిచయం అయిన చిత్రం `స్టూడెంట్ నెం.1`.
బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం ఎన్టీఆర్‌ని హీరోగా నిలబెట్టింది. ఆ తరువాత యాక్షన్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ రూపొందించిన `ఆది` ఎన్టీఆర్‌ని స్టార్‌ని చేసింది. రాజమౌళి రూపొందించిన `సింహాద్రి` స్టార్ హీరోని చేసి అతనికి స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టింది. ఆ తరువాత నుంచి తారక్ వెనుదిరిగి చూసుకునే అవకాశం రాలేదు. మధ్యలో కొన్ని ఫ్లాపులు చూసినా మళ్లీ `యమదొంగ`తో తారక్‌ని రాజమౌళి మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చారు.
ఆ తరువాత మళ్లీ ఎన్టీఆర్ కెరీర్ ట్రాక్ తప్పింది. వరుస పరాజయాలతో విసుగెత్తిపోతున్న వేళ వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అతనికి `టెంపర్` చిత్రంతో మళ్లీ ఊపిరిపోశాడు. ఈ సినిమాతో మళ్లీ ఎన్టీఆర్ కెరీర్ గాడిలో పడింది. ప్రస్తుతం ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఎన్టీఆర్ హీరోగా 20 ఏళ్ల కెరీర్‌ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయన అభిమానులు హంగామా చేస్తున్నారు. ఈ సందర్భంగా కామన్ డీపీని సిద్ధం చేశారు. ఎన్టీఆర్ 20 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేస్తే ఎన్టీఆర్ 20 పేరుతో ఓ రౌండ్ కాయన్ ఆకారంలో సీడీపీని సిద్ధం చేశారు. ఇప్పటి వరకు వివిధ హీరోలు సిద్ధం చేసిన సీడీపీల్లో ఎన్టీఆర్ @20 సీడీపీ టాప్ ట్రెండింగ్‌లో వుండటం విశేషం.