
కేంద్ర ప్రభుత్వం సినిమా షూటింగ్‌లకు మరోసారి అనుమతుల ఇస్తూ తాజాగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. షూటింగ్‌లకు కొత్త మార్గదర్శకాలంటూ పాత వాటినే మళ్లీ తాజాగా విడుదల చేశారు. కెమెరా ముందున్న వారు తప్ప అందరూ మాస్కులు ధరించాలని, లొకేషన్‌లో సాధ్యమైనంత వరకు తక్కువ మంది వుండాలని, ఆరు అడుగుల భౌతిక దూరం తప్పనిసరని, విగ్గులు, దుస్తులు, మేకప్ పరికరాలు పంచుకోవద్దని కొత్త మార్గదర్శకాలని కేంద్రం విడుదల చేసింది.
ఇందులో చెప్పుకోవడానికి కొత్త మార్గదర్శకాలు అంటూ ఏమీ లేవు. పైగా పెద్ద సినిమాల షూటింగ్‌లకు ఈ పద్దతుల్లో షూటింగ్ చేయడం అసాధ్యం. దీంతో కేంద్రం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలపై ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు సి. కల్యాణ్ ఘాటుగా స్పందించారట. ప్రస్తుత గైడ్ లైన్స్ అసంబంద్ధంగా వున్నాయని, రాష్ట్రాల సీఎంలు జీవోలు ఇచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్‌లు చేయడం సాధ్యం కాదని, కేంద్రం ప్రకటించిన గైడ్‌లైన్స్ కొత్తవేమీ కాదని, అందులో ఎలాంటి బెనిఫిట్స్ లేవని సి. కల్యాణ్ ఆగ్రహిం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
వ్యాక్సిన్ రాకుండా హీరోలు, టెక్నీషియన్స్ షూటింగ్ చేయడానికి లొకేషన్ కి వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకోవడానికి నిర్మాతలెవరూ సిద్ధంగా లేరని సి. కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.