
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణం ప్రధానంగా బయటపడటంతో ఈ కోణంలో దర్యాప్తుని ముమ్మరం చేసిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) మంగళవారం సాయంత్రం రియా చక్రవర్తిని అరెస్ట్ చేసింది. సుశాంత్ సింగ్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాకు డ్రగ్ వ్యాపారులకు సంబంధాలు వున్నట్టు బయటపడటంతో గత మూడు రోజులుగా ఎస్‌సీబీ అధికారులు రియాను ప్రశ్నిస్తున్నారు.
తాజాగా మూడవ రోజు రియా పాత్రపై క్లారిటీ రావడంతో ఆమెని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆమెకు డ్రగ్స్ వాడకం విషయంలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. సోమవారం రియాను అరెస్ట్ చేస్తారంటూ పుకార్లు వినిపించిన నేపథ్యంలో అలాంటిఇ ఏమీ లేదని, ఆమె విచారణకు సహకరిస్తోందని వెల్లడించిన ఎన్‌సీబీ అధికారులు సడెన్‌గా షాకిచ్చారు. ఇదిలా వుంటే మూడవ రోజు విచారణతో రియా తాను గంజాయితో పాటు ఇతర డ్రగ్స్ తాను వాడినట్టు రియా వెల్లడించిందని తెలిసింది.
అంతే కాకుండా సుశాంత్ నటించిన ఓ సినిమా సెట్‌లోనూ డ్రగ్స్ వాడామంటూ రియా చెప్పడంతో ఆ సమయంలో ఎవరెవరు వాడారనే దానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు. మూడు రోజులుగా విచారిస్తున్న ఎన్‌సీబీ అధికారులకు రియా బాలీవుడ్‌కు చెందిన మొత్తం 25 మంది సెలబ్రిటీల పేర్లని వెల్లడించిందని, వారికి సమన్లు పంపేందుకు ఎన్‌సీబీ అధికారులు ఆలోచిస్తున్నారని తాజా సమాచారం. తాజా వివాదంతో బాలీవుడ్ చుట్టూ నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.