
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హఠాన్మరణం బాలీవుడ్‌తో పాటు యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆయన చనిపోయి నెల దాటినా ఇప్పటికీ సుశాంత్ మరణంపై చర్చ జరుగుతూనే వుంది. సుశాంత్ ది హత్య ని కొంత మంది, కాదు ఆత్మ హత్యేనని మరి కొంత మంది వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు కొంత మంది సినీ సెలబ్రిటీలను ఎంక్వైరీ చేయడం బాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది.
ఇదిలా వుంటే సుశాంత్ హత్యోదంతంపై త్వరలో సినిమా రాబోతోంది. `సూసైడ్ ఆర్ మర్డర్` పేరుతో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. విజయ్‌శేఖర్ గుప్తా నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌లో నెలకొన్న బంధుప్రీతి, పక్షపాత థోరణిపై వున్న అపోహల్ని తొలగించడానికే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు విజయ్ గుప్తా వెల్లడించారట.
సెప్టెంబర్ 15 నుంచి ముంబై, పంజాబ్, బీహార్ ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నారట. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పాత్రలో ఆయన డూప్ సచిన్ తివారీ నటించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే విజయ్ శేఖర్ గుప్తా ప్రకటించనున్నారట. సుశాంత్ నటించిన చివరి చిత్రం `దిల్ బెచారా` ఈ నెల 24న ఓటీటీలో విడుదల కానుంది.