
బిగ్‌బాస్ ఫేమ్ హిమజ, ప్రతాప్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం `జ`. జై దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై గోవర్థన్‌రెడ్డి కందుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సైదిరెడ్డి చిట్టెపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హిమజ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఫస్ట్ లుక్ టైటిల్ లోగో పోస్టర్‌ని రిలీజ్ చేశారు.
యువ సంగీత దర్శకుడు వెంగీ మాట్లాడుతూ `కొత్త తరహా కథతో ఆద్యతం ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. ఇందులో మొత్తం నాలుగు పాటలున్నాయి. చాలా కొత్త పంథాలో సాగుతాయి. థ్రిల్లర్ చిత్రాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చే చిత్రమిది` అని తెలిపారు. సాధారణ రైతు కుటుంబం నుంచి సినిమాపై వున్న ప్యాషన్‌తో వచ్చాను. తొలి ప్రయత్నంగా `జ` చిత్రాన్ని తెరకెక్కించాను. జ అంటే జన్మ లేదా పుట్టుక అని అర్థం. అదేంటన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే` అని దర్శకుడు సైదిరెడ్డి చిట్టెపు తెలిపారు.
ఇదొక హారర్ థ్రిల్లర్. ఇందులో హిమజ అత్యద్భుతంగా నటించింది. నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చే చిత్రమిది. వెంగి మంచి సంగీతం అందించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం` అని నిర్మాత గోవర్థన్‌రెడ్డి కందుకూరి అన్నారు. సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో సైదిరెడ్డి తనకు ఈ కథ చెప్పారని, నన్ను నమ్మి ఇందులో నటించే అవకాశం ఇచ్చారని నటిగా ఓ మెట్టు ఎక్కించే సినిమా ఇదని హిమజ పేర్కొంది. ఈ కార్యక్రమంలో నటి హిమజ కేక్ కట్ చేసి బర్త్‌డే వేడుకని సెలబ్రేట్ చేసుకున్నారు. కార్యక్రమంలో నటి హిమజ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు. సింగర్ శివజ్యోతితో పాటు `జార్జిరెడ్డి` నిర్మాత అప్పిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.