
కరోనా కథలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటి కథలే. అలాంటి ఓ కథే నటి, బిగ్‌బాస్ ఫేమ్ హరితేజది. సరిగ్గా మరో వారంలో డెలివరీ అనగా తనకు కరోనా అని తేలిందని తెలిపింది నటి హరితేజ. ఇటీవల ఆమె పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇన్‌స్టా వేదికగా తన కన్నీటి గాథని ఓ వీడియో ద్వారా పంచుకుంది.
డెలివరీ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అభిమానులతో పంచుకుంది. డెలివరీకి కొన్ని రోజుల ముందు ఇంటిల్లిపాది కోవిడ్ బారిన పడటంతో తాను ఎంతో భయపడ్డానని తెలిపింది హరితేజ. అంతే కాకుండా దేశంలో ప్రస్తుతం వున్న పరిస్థితులు చూసి కూడా కొంత మంది ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.
`డెలివరీకి సరిగ్గా వారం రోజుల ముందు ఆస్పత్రికి వెళ్లాను. వైద్యులు పరీక్షలు చేసి బేబీ ఆరోగ్యంగా వుందని.. సాధారణ డెలివరీ అవుతుందని చెప్పారు. నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. బేబీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో అనుకోని విధంగా మా కుటుంబ మొత్తం కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎంతో కంగారుగా భయంగా అనిపించింది. అప్పటి వరకు నాకు వైద్యం చేసిన డాక్టర్లు డెలివరీ చేయలేమని చెప్పారు. దాంతో నేను కోవిడ్ ఆస్పత్రిలో చేరాను. నా భర్తకు నెగెటివ్ అని నిర్ధారణ కావడంతో ఆయనే నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు` అని తన బాధని వెల్లడించి భావోద్వేగానికి గురైంది హరితేజ.
View this post on Instagram