
నందమూరి బాలకృష్ణకు ప్రస్తుతం హిట్ చాలా అవసరం. తన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత సరైన హిట్ లేదు. ప్రస్తుతం తన 106వ సినిమాను మొదలుపెట్టాడు. అంటే 4 ప్లాపులు ఉన్నాయి. మధ్యలో వచ్చిన జై సింహాపర్వాలేదనిపించింది. అందులో 3 ప్లాపులు గతేడాదే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళీ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడు. అందుకే తన ఫెవరెట్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో జతకట్టాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో సింహా, లెజండ్ వంటి బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. మాస్ ఇమేజ్ ను సరిగ్గా హ్యాండిల్ చేస్తాడని పేరున్న బోయపాటి, బాలయ్యను సరిగ్గా ప్రెజంట్ చేయగలడని నిరూపించుకున్నాడు. ఆ నమ్మకంతోనే బాలయ్య, బోయపాటితో మరోసారి వర్క్ చేస్తున్నాడు. ఫ్యాన్స్ కూడా ఈ చిత్రంపై చాలానే ఆశలు పెట్టుకున్నారు.
ఈ ఏడాది ఆరంభంలోనే చిత్ర షూటింగ్ మొదలుపెట్టాల్సి ఉంది కానీ స్క్రిప్ట్ విషయంలో పక్కాగా ఉండడం, బడ్జెట్ లెక్కలను మరోసారి సరిచూసుకోవడం వంటి కారణాలతో ఈ నెలలోనే షూటింగ్ ను మొదలుపెట్టారు. రెండు నెలలు ఆలస్యమైంది. అయితే దీన్ని సరిచేయడానికి బాలకృష్ణ బ్రేకులు పెద్దగా లేకుండా షూటింగ్ ను శరవేగంగా జరిపించాలని నిర్ణయించాడు. ఎలాగైనా మేకు చిత్ర షూటింగ్ మొత్తం పూర్తైపోవాలన్నది బాలయ్య ఆలోచన.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు ఏవీ ప్రేక్షకులకు రివీల్ చేయలేదు. బాలయ్య రెండు లుక్స్ లో కనిపిస్తాడని అంటున్నారు. అందులో ఒకటి అఘోరా గెటప్ అన్న వాదన కూడా ఉంది. అయితే ఇందులో ఏవి నిజాలన్నవి మాత్రం తెలియలేదు. ఇంకా టైటిల్ ఏంటి, హీరోయిన్ ఎవరు వంటి విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ ఉగాదికి చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి బాలయ్య ఈ విషయంలో అభిమానుల కోరికను తీరుస్తాడా లేదా అన్నది మరికొద్ది రోజులు ఆగితే తేలిపోతుంది.