
బాహుబలిని చూసి యావత్ భారతదేశం గర్వించింది. ఈ సినిమాను చూసి అందరూ తెగ పొగిడేశారు కానీ ఆ చిత్రాన్ని చూసి కుళ్లుకున్నవాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ వాళ్ళు బాహుబలిని తలదన్నే సినిమా తీయాలని చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ అవి బాహుబలి దరిదాపుల్లోకి వెళ్లలేకపోవడం గమనార్హం. ఆ మాట అటుంచి కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడినే వెనక్కి తెలేకపోతున్నాయి. ఈ మధ్యే విడుదలైన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్, కళాంక్ వంటి సినిమాల పరిస్థితి ఏమైందో చూసాం. అయినా కానీ బాలీవుడ్ వాళ్ళ కోరిక మాత్రం చావట్లేదు. బాహుబలిని టార్గెట్ చేసే భారీ సినిమాలు వస్తూనే ఉన్నాయి.
బాజీరావు మస్తానీ, పద్మావత్ వంటి సినిమాలైతే ప్రేక్షకాదరణ పొందాయి. వసూళ్లు కూడా బానే ఉన్నాయి. కానీ అవి బాహుబలి తరహాలో భారీ విజయాలు కావు. అన్ని వర్గాల వారిని ఆకర్షించలేదు. అన్ని భాషల్లో ఆదరించబడలేదు. అందుకే ఆ స్థాయి వసూళ్లు రాలేదు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే పానిపట్ అనే మరో భారీ చిత్రం వచ్చింది. భారతదేశ చరిత్రలో ఎంతో ముఖ్యమైన ఘట్టంగా పానిపట్ యుద్ధం గురించి చెప్పుకుంటారు. దాని ఆధారంగా చేసుకుని రూపొందించిన సినిమా పానిపట్. చారిత్రాత్మక సినిమాలకు బాలీవుడ్ లో సుప్రసిద్ధుడు అశుతోష్ గోవారికర్.
ఈయన దర్శకత్వంలో గతంలో లగాన్, మోహెన్ జోదారో, జోదా అక్బర్ వంటి సినిమాలొచ్చాయి. లగాన్ సూపర్ హిట్ అవ్వగా, జోదా అక్బర్ ఓ మోస్తరు సినిమాగా నిలిచింది. ఇక మోహెన్ జోదారో అయితే ఆ ఏడాది వచ్చిన అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అలాంటి అశుతోష్ తీసిన పానిపట్ కు ఇప్పుడు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. క్రిటిక్స్ కూడా దీనికి యావరేజ్ రేటింగులు వేశారు. కలెక్షన్స్ కూడా నామమాత్రంగానే ఉన్నాయి. సో మరో సినిమా బాహుబలిని టార్గెట్ చేసి విఫలమైందని చెప్పవచ్చు.