
పాటలలో లెజండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. కొన్ని వేల పాటలకు ఆయన ప్రాణం పోసిన విధానం అద్భుతం. ఆయన మన నుండి దూరమై ఏడాది అప్పుడే గడిచిపోయింది. ఆయన పాటలలో సేదతీరని మనిషి లేడు అంటే అతిశయోక్తి కాదు. ఎస్పీ బాలు స్వరం వినడానికి కొన్ని వేల పాటలు ఉన్నా కానీ ఆయన నుండి కొత్త పాటలు రావే అన్న దిగులు ప్రతీ సంగీత ప్రియుడిలోనూ ఉంది.
అయితే ఎస్పీ బాలు పాడిన కొత్త పాట విడుదల కాబోతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో అన్నాత్తే చిత్రం విడుదలవుతోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. రజినీకాంత్ సినిమా అంటే ఇంట్రడక్షన్ సాంగ్ వేరే లెవెల్ లో డిజైన్ చేస్తారు దర్శకులు. రజినీ ఇంట్రడక్షన్ సాంగ్స్ చాలా సినిమాలుగా బాలసుబ్రహ్మణ్యం పాడుతూ వచ్చారు.
అన్నాత్తేకు కూడా ఆయనే పాడారు. ఇప్పుడు ఆ సాంగ్ విడుదలవుతోంది. అక్టోబర్ 4న సాయంత్రం ఆరు గంటలకు అన్నాత్తే ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయనున్నారు. ఎస్పీ బాలు పాడిన పాట విడుదలవుతుండడంతో సంగీత ప్రియులు ఉద్వేగానికి లోనవుతున్నారు.