
ఇటీవల స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఇదిలా వుంటే మరో స్టార్ డైరెక్టర్ కోవిడ్ బారిన పడ్డారు. ఆయనే అనిల్ రావిపూడి. బ్లాక్ బస్టర్ మూవీ `ఎఫ్ 2`కి సీక్వెల్‌గా ఆయన `ఎఫ్3`ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫ్రెష్ షెడ్యూల్ ఇటీవల మైసూర్‌లో ప్రారంభమైంది.
అయితే తాజాగా అనిల్ రావిపూడికి COVID-19 పాజిటివ్ అని తేలడంతో ఈ షెడ్యూల్‌ని రద్దు చేశారు. ఇటీవల చేసిన టెస్టుల్లో అనిల్‌కు పాజిటివ్ అని తేలడంతో మైసూర్ షెడ్యూల్‌ని రద్దు చేశారట. ఉగాది రోజు `ఎఫ్3` కొత్త షెడ్యూల్ ప్రారంభాన్ని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించిన అనిల్ రావిపూడి ప్రస్తుతం కోవిడ్ సోకడంతో స్వీయ నిర్భంధంలోకి వెళ్లారట.
ఫిల్మ్ యూనిట్ వాస్తవానికి మైసూర్‌లో భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది. వెంకటేష్ `దృశ్యం – 2` షూట్ పూర్తి చేయడంతో `ఎఫ్3` కోసం ఎక్కువ డేట్‌లు ఇచ్చారట. అయితే తాజా పరిణామాలతో కొత్త షెడ్యూల్ రద్దు చేశారని, దర్శకుడు కోలుకున్న తర్వాతే షూట్ తిరిగి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉంది.