
అనసూయ జబర్దస్త్ యాంకర్ గా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. బుల్లితెర నుండి వెండి తెరకు వెళ్లిన అనసూయ అక్కడ కేవలం ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటోంది. ఏది పడితే అది సినిమా చేసేయడం అనసూయకు ఇష్టం లేదు. ఇదే విషయాన్ని ఆమె పలు ఇంటర్వ్యూలలో తెలిపింది. రంగస్థలం సినిమాతో బాగా క్రేజ్ సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోన్న విషయం తెల్సిందే. కృష్ణవంశీ ప్రస్తుతం రంగమార్తాండ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
అభిషేక్ మరియు మధు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగి ప్రస్తుతం కరోనా కారణంగా బ్రేకులు పడ్డాయి. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ మరో ప్రధాన పాత్రను పోషిస్తోంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత రమ్యకృష్ణను కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది నిజంగా విశేషమే.
ఇక ఈ సినిమాలో అనసూయ పాత్ర విషయానికొస్తే ఆమెది కూడా కీలక పాత్రే అని తెలుస్తోంది. జీవితాంతం పెళ్లి అనేది లేని మహిళ పాత్రలో అనసూయ కనిపించనుంది. పైగా ఈ చిత్రంలో నాటకాలు వేసే కళాకారిణి పాత్రలో అనసూయ నటన హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ పాత్ర ఆమెకు ఇంకెంత పేరు తెచ్చి పెడుతుందో.