
కోటా శ్రీనివాస రావు ఇటీవలే చేస్తోన్న వ్యాఖ్యలు కొన్ని వివాదాస్పదమవుతున్నాయి. మా ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ ను ఉద్దేశిస్తూ కోటా కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసాడు. ప్రకాష్ రాజ్ తో తాను చాలా సినిమాలు చేసానని, ఒక్క రోజు కూడా ఆయన సమయానికి రాడని, అస్సలు డిసిప్లిన్ లేని వ్యక్తిని మా పీఠం ఎలా ఎక్కిస్తామని అన్నాడు. ప్రకాష్ రాజ్ విషయంలో ఎప్పుడూ కోటా నెగటివ్ గానే వ్యాఖ్యానిస్తాడు కాబట్టి అది ఓకే అనుకోవచ్చు కానీ ఇప్పుడు అనవసరంగా అనసూయ బట్టల గురించి వ్యాఖ్యానించి నెగటివ్ అయ్యాడు కోటా.
ఒక ఇంటర్వ్యూలో జబర్దస్త్ గురించి మాట్లాడుతూ సందర్భంగా లేకపోయినా అనసూయ పేరుని తీసుకొచ్చాడు. అనసూయ మంచి నటి అని, చక్కని ఫిజిక్ ఆమె సొంతం, బాగా డ్యాన్స్ చేస్తుంది, హావభావాలు చక్కగా పలికిస్తుంది, అయితే ఆమె బట్టల విషయంలో కొంత చూసుకోవాలని, నిండైన వస్త్రధారణతో ఉంటే బాగుంటుంది, అదొక్కటే ఆమె విషయంలో నేను చెప్పేది అని కోటా అన్నాడు.
అనసూయ ఈ విషయంపై రెస్పాండ్ అయ్యింది. పేరు ఎత్తకుండా ఒక సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యల పట్ల తనకు అభ్యంతరాలు ఉన్నాయని అంది. అదే నటుడు తెరపై తాగుబోతు పాత్రలు చేసాడు, పిచ్చి బట్టలు వేసుకున్నాడు, అమ్మాయిలపై అఘాయిత్యాలు చేసే పాత్రలు పోషించాడు, మరి వాటిపై ఎవరూ మాట్లాడరా? మగవాళ్ళు ఎలా ఉన్నా కూడా ఓకే కానీ ఆడవారి విషయంలో మాత్రమే అందరికీ ఇబ్బందులు వస్తాయి అని ఘాటుగానే స్పందించింది.