
ఫిల్మ్ ఇండస్ట్రీల్లో మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో సెంటిమెంట్‌లకు పెద్ద పీట వేస్తుంటారు. ఏ సినిమా రిలీజ్ చేయాలన్నా, ప్రారంభించాలన్నా గంటలు నిమిషాలు ముహూర్తం మరీ చూసుకుని చేస్తుంటారు. అదే సెంటిమెంట్‌గా భావిస్తుంటారు కూడా. అయితే ఒక్కో సారి ఆ సెంటిమెంట్ తప్పితే ఫలితం తారుమారవుతుందని వారి నమ్మకం. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ సెంటిమెంట్‌ని బ్రేక్ చేయరు. కానీ నాని సినిమా విషయంలో మాత్రం టీమ్‌కి తెలియకుండానే సెంటిమెంట్ బ్రేక్ అయినట్టు తెలిసింది.
నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు హీరోలుగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ `వి`. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించారు. నివేదా థామస్, అదితీరావు హైదరీ హీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్, హర్షిత్‌రెడ్డి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ శనివారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని మాత్రం అమెజాన్ ప్రైమ్ వర్గాలు శుక్రవారం రాత్రి 10 గంటలకే స్ట్రీమింగ్‌కి పెట్టేశారట.
ఈ విషయం `వి` టీమ్‌లో ఎవరికి తెలియక పోవడంతో టీమ్ అంతా షాక్ కు గురవుతున్నారు. సెంటిమెంట్ ప్రకారం సెప్టెంబర్ 5న నాని నటించిన తొలి చిత్రం `అష్టాచమ్మా` విడుదలైంది. ఆ సెంటిమెంట్‌ని రిపీట్ చేస్తూ `వి` అదే రోజు విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అమెజాన్ ప్రైమ్ వారు టీమ్‌కి తెలియకుండానే సెప్టెంబర్ 4న రిలీజ్ చేయడంతో ఆ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది. దీంతో టీమ్ మొత్తం షాకయ్యిందట.