
అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. కెరియర్‌లో ఇండస్ట్రీ హిట్ లేదని ఫీలవుతున్న బన్నీకి సాలిడ్ హిట్‌ని అందించింది.
ఈ సినిమా తరువాత మళ్లీ త్రివిక్రమ్ – బన్నీ కలిసి పనిచేస్తున్నారు. అయితే అది సినిమా కోసం కాదు ఓ యాడ్ ఫిల్మ్ కోసం. బన్నీ ఫాదర్ అల్లు అరవింద్ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లకు ధీటుగా ఆహా పేరుతో ఓటీటీ ప్లాట్ ఫామ్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ యాప్ కోసం చాలా చిత్రాలతో పాటు కొత్తగా లోకల్ కంటెంట్‌ని కూడా ప్రోత్సహిస్తున్నారు.
ఈ ఓటీటీ కోసం త్రివిక్రమ్ ఓ యాడ్‌ని చేస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ నటిస్తున్నాడు. అతనికి జోడీగా కేతికాశర్మ నటిస్తోంది. పూరి ఆకాష్ హీరోగా నటిస్తున్న `రొమాంటిక్` చిత్రం ద్వారా కేతికా శర్మ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ యాడ్ ఫిల్మ్ షూటింగ్ బుధవారం నుంచి ప్రారంభం కాబోతోంది. మొత్తం 10 రోజుల పాటు ఈ యాడ్‌ని ప్రసారం చేస్తారట. దీని కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా సెట్‌ని నిర్మించారు.