
ఒక విజయం కొంత మందికి ఉత్సాహాన్నిస్తే కొంత మందిని భావోద్వేగానికి గురయ్యేలా చేస్తుంది. ఎనిమిదేళ్ల నిరీక్షణ తరువాత విజయం లభిస్తే ఖచ్చితంగా భావోద్వేగానికి లోనవుతారు. అల్లరి నరేష్ కూడా శుక్రవారం సాయంత్రం భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆన నటించిన తాజా చిత్రం `నాంది`. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు.
వేగేశ్న సతీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ట్రైయల్ ఖైదీ కథ నేపథ్యంలో సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. తొలి రోజే మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. సినిమా కంటెంట్‌తో పాటు నరేష్ నటనపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయోత్సవ సంబరాలు జరుపుకుంది. ఈ సందర్భంగా ఇందులో తనకు తండ్రిగా నటించిన దర్శకుడు, నటుడు దేవిప్రసాద్‌ని హత్తుకుని నరేష్ భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.
`2012 ఆగస్టులో `సుడిగాడు` విడుదలైంది. కెరీర్‌లో పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రమది. ఆ తరువాత మళ్లీ ఆ స్థాయి విజయానికి ఎనిమిదేళ్లు పట్టింది. వరుసగా ఎనిమిదేళ్లు పరాజయాల్లో వున్నా. నా దగ్గరికి వచ్చి ఓ సీరియస్ సినిమా చేద్దామని చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి. ఆ ధైర్యం, ప్రోత్సాహం నిర్మాత సతీష్ వేగేశ్నలో వుంది. నా రెండో ఇన్నింగ్స్‌కి జీవితాన్నిచ్చారు దర్శకుడు విజయ్ కనకమేడల. ఉదయం నుంచి చాలా మంది ఫోన్‌లు చేసి మెచ్చుకుంటున్నారు. ఇకపై ఇలాంటి కథాబలమున్న సినిమాలు చేయండని చెబుతున్నారన్నారు అల్లరి నరేష్.