
సీనియర్ తమిళనటి, భాజపా నాయకురాలు ఖుష్బూ సుందర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. బుధవారం ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ రోజు ఉదయం కారులో వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న కారుని ట్యాంకర్ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఏయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఖుష్బూ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఆమె ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాద విషయాన్ని స్వయంగా ఖుష్బూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. `కడలూరు వెళుతుండగా మార్గమధ్యంలో మెల్మర్వతూర్ వద్ద మేం ప్రయాణిస్తున్న కారుని ట్యాంకర్ ఢీకొట్టింది. దేవుడి దయవల్ల మేం సురక్షితంగా బయటపడ్డాం. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు` అని తెలిపింది.
ఖుష్బూ కారు ప్రమాదానికి గురైన ఫొటోలు అభిమానులతో పాటు బీజేపీ కార్యకర్తలని భయాందోళనకు గురిచేశాయి. ఖుష్బూ ట్వీట్‌తో అంతా ఊపరి పీల్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో గత కొంత కాలంగా యాక్టీవ్‌గా వున్న ఖుష్బూ ఇటీవల ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమెపై విమర్శలు ఎక్కువయ్యాయి. తాజాగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.