
కొంత మందికి ఉన్నత చదువులు చదవాలని వుంటుంది. కానీ పరిస్థితులు వారి కోరికని మధ్యలోనే తుంచేస్తాయి. కానీ కొంత మంది వయసు మీద పడినా తాము కోల్పోయిన దాన్ని తిరిగి పొందాలని, నచ్చిన చదువులు చదవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. చదువుకు వయసుతో సంబంధం లేదని చాలా సందర్భాల్లో నిరూపించబడింది. ఇదే విషయాన్ని అక్షరాల నిజం చేస్తున్నారు నటి హేమ.
చదువుపై వున్న మక్కువతో ఆమె ఈ స్టేజ్‌లో డిగ్రీ చదవాలనుకుంటున్నారు. ఇందు కోసం ఆదివారం ఆమె నల్లగొండలోకి ఓ కాలేజీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అర్హత ప్రవేశం కోసం పరీక్ష రాశారు. 7వ తరగతి వరకు చదువుకుని మధ్యలో ఆపేసిన ఆమెకు డిగ్రీ పూరి్త చేయాలని కోరికట. ఆ తరువాత కూడా కంప్యూటర్ కు సంబంధించిన కోర్సులు కూడా చేయాలని వుందట. ఆ కోరికమేరకే ఆమె డిగ్రీ అర్హత పరీక్షకు హాజరు కావడం అందిరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అర్హత పరీక్ష రాసిన అనంతరం హేమ మాట్లాడారు. చదువు కోవడం అంటే తనకు చాలా ఇష్టమని నటిగా బిజీగా వుండటం వల్ల ఇన్నేళ్లు కుదరలేదని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో పరీక్ష రాయడానికి చాలా ఇబ్బందులు వున్నాయని ఆ కారణంగానే తాను నల్లగొండలో పరీక్ష రాశానని తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ షూటింగ్‌లో పాల్గొంటున్న ఆమె ఆ పరిసరాల్లో వున్న తన బంధువుల ఇంటి వద్ద వుండి డిగ్రీ అర్హత పరీక్ష రాసినట్టు తెలిసింది.