
సినిమాల్లో హీరోయిజం చూపించే నటులు కరోనా వేళ నిజ జీవితంలోనూ రియల్ హీరోలు అవుతున్నారు. కరోనా దేశంలోకి ఎంటరైన దగ్గరి నుంచి నటుడు సోనుసూద్ తన వంతు బాధ్యతలగా సహాయం అన్న వారికి అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇలాగే మరో కన్నడ నటుడు కూడా కరోనా పేషెంట్‌ల కోసం నేనున్నానంటూ ముందుకొచ్చాడు.
కన్నడ నటుడు అర్జున్ గౌడ కూడా కోవిడ్ బాధితుల కోసం తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆయన ఏకంగా అంబులెన్స్ డ్రైవర్‌గా మారారు. కర్ణాటకలో కరోనా ఉదృతంగా కొనసాగుతున్న వేళ వైరస్ బాధితుల పరిస్థితులను తెలుసుకుని అర్జున్ గౌడ ఎంతగానో చలించిపోయారు. తన వంతుగా ఏదో ఒక సాయం చేయాలని భావించి ఆయన తన వద్ద వున్న అంబులెన్స్‌కు స్వయంగా డ్రైవర్‌గా మారి కోవిడ్ బాధితులను ఆసుపత్రులకు చేరుస్తున్నారు.
అంతేగాక, వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి అంతిమ సంస్కారాల్లో ఆ కుటుంబాలకు అండగా వుంటున్నారు. మరో రెండు నెలల పాటు తాను డ్రైవర్‌గానే వుంటానని నటుడు అర్జున్ గౌడ అంటున్నారు. `సాయం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్లేందుకు నేను సిద్ధమే. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు అస్సలు బాగావేవు. ఆపదలో వున్న వారి కోసం నా వంతు సాయం చేయాలనుకుంటున్నా` అని అర్జున్ గౌడ చెప్పుకొచ్చారు.