
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ఆచార్య షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాను డిసెంబర్ 17న విడుదల చేద్దామనుకున్నారు. అదే రోజు అల్లు అర్జున్ నటించిన పుష్ప విడుదలవుతోంది అని తెల్సినా వెనక్కి తగ్గకూడదు అని డిసైడ్ అయ్యారు. దీంతో మెగా క్యాంప్ లో కొంత కలవరం మొదలైంది. మెగా హీరోల సినిమాలు రెండూ ఒకే రోజు విడుదల కావడం బాక్స్ ఆఫీస్ కు మంచిది కాదని, బయటకు కూడా సంకేతాలు తప్పుగా వెళతాయని ఫ్యాన్స్ భయపడ్డారు.
అయితే రీసెంట్ గా చిరంజీవి కొంత మంది డిస్ట్రిబ్యూటర్లతో మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అక్కడకు వెళ్లిన డిస్ట్రిబ్యూటర్లు కూడా డిసెంబర్ 17 రిలీజ్ కు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిపారు. ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ హీరోగా చేస్తున్నాడు. ఆచార్యలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇలా రెండు రామ్ చరణ్ చిత్రాలు మూడు వారాల వ్యవధిలో విడుదల కావడం అంత మంచిది కాదని వారు అభిప్రాయపడ్డారు.
అలాగే ఆర్ ఆర్ ఆర్ విడుదల తర్వాత తెలుగు సినిమా మార్కెట్ మరింత విస్తృతం చెందుతుంది. బాహుబలి తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయో తెల్సిందే. ఆర్ ఆర్ ఆర్ తర్వాత కూడా పరిస్థితి మారవచ్చు. అందుకే ఆర్ ఆర్ ఆర్ విడుదలయ్యే వరకూ ఆచార్య రిలీజ్ ప్లాన్స్ ను పూర్తిగా పక్కన పెట్టాలని చిరు నిర్ణయించుకున్నాడట.