
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ మధ్య మంచి అనుబంధం వున్న విషయం తెలిసిందే. రాజమౌళితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా వున్నానని `బాహుబలి` తరువాత అమీర్‌ఖాన్ బహిరంగంగా వెల్లడించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో ఓ భారీ ప్రాజెక్ట్ కార్యరూపం దాలుస్తుందని అంతా భావించారు. కానీ అది ఇప్పటికీ జరగలేదు.
మహాభారతాన్ని తీస్తే అందులో అమీర్‌ఖాన్ నటిస్తాడని కూడా ప్రచారం జరిగింది. దీనిపై రాజమౌళి కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇదిలా వుంటే తాజాగా వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారని తాజాగా వినిపిస్తోంది. రాజమౌళి ప్రస్తుతం యంగ్‌టైగర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో `ఆర్ ఆర్ ఆర్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ గత ఎనిమిది నెలల విరామం తరువాత ఇటీవలే
మొదలైంది.
ఈ మూవీ కోసం రాజమౌళితో అమీర్‌ఖాన్ జతకట్టబోతున్నారట. ఇటీవలే ఈ మూవీ కోసం జక్కన్న .. అమిర్‌ఖాన్ సాయం కోరినట్టు తెలిసింది. `ఆర్‌ఆర్‌ఆర్` హిందీ వెర్షన్‌లో ఎన్‌టిఆర్, రామ్ చరణ్ పాత్రలను అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్‌తో పరిచయం చేయబోతున్నారట. దక్షిణాది భాషల్లో ఎన్టీఆర్ , రామ్‌చరణ్ ఒకరి పాత్రలని మరొకరు పరిచయం చేస్తూ వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే. హిందీ వెర్షన్ కు మాత్రం ఈ ఇద్దరి పాత్రలని అమీర్‌ఖాన్ పరిచయం చేయబోతున్నారట. హిందీ ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీకి మరింత క్రేజ్‌ని అందించడంలో భాగంగా రాజమౌళి ఈ ప్లాన్ వేశారని చెబుతున్నారు.